ఆ సినిమా విడుదల అయ్యేది ఎప్పుడో ?

Published on Dec 10,2019 07:21 PM

అల్లరి నరేష్ హీరోగా నటించిన '' బంగారు బుల్లోడు '' చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉండే కానీ ఈ ఏడాది కూడా అయిపోతోంది కానీ ఆ సినిమా మాత్రం విడుదల ఎప్పుడు అనేది తెలియడం లేదు. పివి గిరి దర్శకత్వం వహిస్తున్న బంగారు బుల్లోడు చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు. ఈ నిర్మాత ఇదే సమయంలో మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నాడు దాంతో ఆ సినిమాపై దృష్టి పెట్టి బంగారు బుల్లోడు సినిమాని పక్కన పెట్టాడు. అసలు ఈ సినిమా వేసవిలోనే విడుదల కావాల్సి ఉంది కానీ అలా అలా వాయిదా పడుతూ ఎప్పుడు విడుదల అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

నందమూరి బాలకృష్ణ నటించిన బంగారు బుల్లోడు సూపర్ హిట్ చిత్రం కావడంతో కాబోలు అల్లరి నరేష్ చిత్రానికి ఈ బంగారు బుల్లోడు అనే టైటిల్ ని పెట్టారు అంతేకాదు ఆ సినిమాలోని ''స్వాతి లో ముత్యమంత ''అనే బ్లాక్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ కూడా చేసారు. గతకొన్ని సంవత్సరాలుగా అల్లరి నరేష్ కు సరైన హిట్ లేకుండాపోయింది. దాంతో ఇటీవలే మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి చిత్రంలో మహేష్ ఫ్రెండ్ గా ప్రాముఖ్యత ఉన్న పాత్ర లో నటించాడు. ఆ సినిమా మంచి హిట్ అయ్యింది. ఇక విడుదలకు రెడీ గా ఉన్న బంగారు బుల్లోడు కి మోక్షం ఎప్పుడో అన్నది తేలాల్సి ఉంది.