మరో చిత్రాన్ని వేసవిలో ప్రారంభించనున్న వెంకటేష్

Published on Jan 26,2020 04:17 PM

సీనియర్ హీరో వెంకటేష్ జోరు పెంచాడు. ఎఫ్ 2 , వెంకీ మామ విజయాలతో మంచి జోరు మీదున్నాడు. గత ఏడాది నటించిన రెండు చిత్రాలు విజయవంతం కావడంతో స్పీడ్ పెంచిన వెంకీ తాజాగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నారప్ప అనే చిత్రం చేస్తున్నాడు. తమిళంలో సంచలన విజయం సాధించిన అసురన్ చిత్రాన్ని తెలుగులో నారప్పగా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక అదే జోరులో పెళ్లిచూపులు దర్శకులు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో మరో చిత్రాన్ని చేయనున్నాడు వెంకటేష్.

హార్స్ రైడింగ్ , రేసింగ్ నేపథ్యంలో ఈ కొత్త చిత్రం రూపొందనున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ హార్స్ రేసర్ గా విభిన్న పాత్రలో కనిపించనున్నాడట. పెళ్లిచూపులు చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన తరుణ్ వెంకీ ని సరికొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడట. ఇక ఈ సినిమా ఈ వేసవిలోనే సెట్స్ మీదకు వెళ్లనుందట. అలాగే ఎక్కువ భాగం హార్స్ రేస్ ప్రాంతమైన హైదరాబాద్ లోనే చిత్రీకరించనున్నారట. ఈ సినిమా కూడా ఈ ఏడాదే విడుదల కానుంది.