70 శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఆర్ ఆర్ ఆర్

Published on Nov 20,2019 03:52 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ , రాంచరణ్ తేజ్ లు హీరోలుగా నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ ఆర్ ఆర్ ఎట్టకేలకు 70 శాతం షూటింగ్ ని పూర్తి చేసుకుందని అధికారికంగా ప్రకటించారు. గతకొన్ని రోజులుగా ఆర్ ఆర్ ఆర్ చిత్రం పై పలు ఊహాగానాలు చెలరేగుతున్న నేపథ్యంలో 70 శాతం షూటింగ్ పూర్తయ్యిందని పేర్కొనడంతో వచ్చే ఏడాది జులై లో విడుదల కావడం ఖాయమే అని తేలిపోయింది.

అయితే చరణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ఖరారు అయ్యింది కానీ ఎన్టీఆర్ సరసన నటించే భామ ఎవరు ? అన్నది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. అయితే ఆ సస్పెన్స్ కి ఈరోజు తెరలేపనున్నారట. ఈరోజు ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ ఎవరన్నది తేల్చనున్నారు అలాగే విలన్ పాత్రధారులను కూడా పరిచయం చేయనున్నారు. ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుండగా చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నాడు. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.