విజయశాంతి సంచలన నిర్ణయం

Published on Feb 03,2020 12:29 PM

లేడీ అమితాబ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై సినిమాల్లో నటించేది లేదని ట్వీట్ చేసి టాలీవుడ్ వర్గాలను షాక్ కి గురిచేసింది. 13 సంవత్సరాల తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించి మెప్పించింది. కీలక పాత్రలో నటించిన విజయశాంతి రీ ఎంట్రీలో అదరగొట్టింది. దాంతో విజయశాంతి మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతుందని అనుకున్నారు అంతా. అంతేకాదు పలువురు దర్శక నిర్మాతలు విజయశాంతిని తమ సినిమాలో నటించాలని కోరారట కూడా.

అయితే అందరికీ షాక్ ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది విజయశాంతి. ఇకపై సినిమాల్లో నటించను ...... నాకు అంత సమయం లేదు ఇక సెలవు అంటూ చేసిన ట్వీట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజకీయంగా చూస్తే ఆమెకు పదవి లేదు , పైగా తెలంగాణలో ఎన్నికలు జరగాలంటే ఇంకా నాలుగేళ్ళ సమయం ఉంది అప్పటివరకు కేసీఆర్ ప్రభుత్వం కొనసాగనుంది. పైగా కాంగ్రేస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉందా ? అదీ లేదు అయినప్పటికీ సినిమాలకు మళ్ళీ గుడ్ బై చెప్పడం ఏంటి ? అని ఆశ్చర్యపోతున్నారు.