మళ్ళీ డైరెక్షన్ చేస్తానంటున్న సుచిత్ర చంద్రబోస్

Published on Jan 26,2020 04:24 PM

పల్లకిలో పెళ్లికూతురు అనే చిత్రంతో మెగా ఫోన్ పట్టి దర్శకురాలిగా తన ప్రతిభని చాటిన సుచిత్రా చంద్రబోస్ మళ్ళీ మెగా ఫోన్ పట్టడానికి సిద్ధం అవుతోంది. మంచి కథ సిద్ధం చేసుకున్నాను కానీ మంచి నిర్మాత దొరికితేనే ఆ సినిమాని తెరకెక్కిస్తానని అంటోంది సుచిత్ర. కొరియోగ్రాఫర్ అయిన సుచిత్ర ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 1999 లో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోగా 20 ఏళ్ల కాపురంలో ఎలాంటి అపోహలు , అపార్ధాలు లేకుండా సాగిపోయిందని సంతోషం వ్యక్తం చేస్తోంది సుచిత్ర చంద్రబోస్.

ఇక గేయ రచయిత చంద్రబోస్ కూడా సుచిత్ర తనకు దక్కిన వరం అంటూ అమితానందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. 20 ఏళ్ల క్రితం తమ పరిచయం పెళ్ళికి ఎలా దారి తీసిందో సవివరంగా వెల్లడించాడు. ఓ పత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు చంద్రబోస్. వందలాది తెలుగు చిత్రాల్లో సూపర్ హిట్ గీతాలను రాసిన చంద్రబోస్ భార్య మళ్ళీ మెగా ఫోన్ పడతానంటే తప్పకుండా సహకారం అందిస్తానని అంటున్నాడు.