త్రివిక్రమ్ ని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

Published on Apr 23,2020 05:08 PM
దర్శకులు త్రివిక్రమ్ ని కొంతమంది అదేపనిగా ట్రోల్ చేస్తున్నారు. త్రివిక్రమ్ ఇప్పటి వరకు తీసిన ప్రతీ సినిమాలో ఏదో ఒక సీన్ హాలీవుడ్ నుండి కాపీ కొట్టిందేనని అందుకే కాపీరాయుడు అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. అందుకు ఉదాహరణగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రాల్లోని కాపీ సీన్లను ఇదిగో యాజిటీజ్ గా వాడావు అంటూ సదరు క్లిప్ లను కూడా పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు. త్రివిక్రమ్ కు తెలుగులో ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది.

తనదైన పంచ్ లతో తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించాడు త్రివిక్రమ్. అయితే ఈ దర్శకుడు దర్శకత్వం వహించిన చాలా చిత్రాల మీద కాపీ ముద్ర పడింది. హాలీవుడ్ చిత్రాలను కాపీ కొడతాడని పేరు. కానీ ఎవరి గోల ఎలా ఉన్నా త్రివిక్రమ్ మాత్రం మిగతా వాటిని పట్టించుకోకుండా తనపని తాను చేసుకుంటూ పోతాడు. తాజాగా అల వైకుంఠపురములో చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక ఇప్పుడేమో ఎన్టీఆర్ కోసం అయిననూ పోయిరావలె హస్తినకు అనే స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడు. త్వరలోనే ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.