అమ్మలగన్న అమ్మ మూలపుటమ్మ ఆడియో విడుదల

Published on Sep 29,2019 10:46 AM

కళాసాధన ప్రొడక్షన్స్ పతాకంపై కళాసాధన కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా అమ్మలగన్న అమ్మ మూలపుటమ్మ. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తూ...కథా మాటలు పాటలు అందిస్తున్నారు డాక్టర్ ఏపి చారి. రోహిత్ చంద్ర, డాక్టర్ ఏపీ చారి, శ్రీమతి విజయలక్ష్మి ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వికార్ షా, కావ్యకీర్తి, తులసి, మిత్ర ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. రవి మూలకలపల్లి సంగీతాన్ని అందించిన అమ్మలగన్న అమ్మ మూలపుటమ్మ ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో జరిగింది.
        ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిలింఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ అతిథులుగా పాల్గొన్నారు. ఆడియో విడుదల అనంతరం రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ...మంచి చిత్రానికి చిన్నా పెద్దా తేడా లేదు. ఈ సినిమా కోసం చిత్ర బృందమంతా ఎంత కష్టపడ్డారో తెలుస్తోంది. పాటలు బాగున్నాయి. ఈ చిత్రం మంచి విజయం సాధించి, వీళ్లు మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
        చిత్ర దర్శకుడు కళాసాధన కృష్ణ మాట్లాడుతూ...దర్శకుడిగా నాకిది రెండో సినిమా. మొదటి చిత్రంగా బాలల సినిమా రూపొందించాను. సినిమా అంతా ఒక ఇంటిలో రూపొందించాం. గ్రీన్ మ్యాట్ ఊపయోగించి అవసరమైన చోట గ్రాఫిక్స్ వాడాం. నిర్మాత చారి గారు చెప్పిన లైన్ ఆధారంగా సినిమా చేశాం. సినిమాలో ఐదు కథలుంటాయి. అవన్నీ ఒకదానికొకటి అల్లుకుని వస్తాయి. మూలపుటమ్మ కథ చెబుతూ..చెడుపై మంచి ఎలా గెలిచింది అనేది చూపిస్తున్నాం. చిత్రీకరణ పూర్తయింది. సెన్సార్ కు పంపిస్తున్నాం. అన్నారు.
         నిర్మాత డాక్టర్ ఏపీ చారి మాట్లాడుతూ..సంప్రదాయంలో మన దేశ గొప్పదనం చెప్పాలని చేసిన ప్రయత్నమిది. భారతదేశం ఒక దేవాలయం లాంటిది. మన ప్రాచీన దేవతలు చాలా శక్తివంతమైనవారు. ముగ్గురమ్మల మూలపుటమ్మ అంటు ఉంటాం కానీ ఆ మూలపుటమ్మ ఎవరు, ఆమె శక్తి ఏమిటి అనేది చాలా మందికి తెలియదు. ఆమె గొప్పదనం చూపిస్తూ, భారతదేశం ఎంత ఉన్నతమైందో, ప్రపంచమంతా మన దేశాన్ని ఎందుకు ప్రేమిస్తుందో సినిమాలో తెలియజేశాం. ఈ సినిమాను నా పెన్షన్ డబ్బులతో తీశాను. పిల్లలు పెద్దలు అందరికీ నచ్చుతుంది. అన్నారు
              సంగీత దర్శకుడు రవి మూలకలపల్లి మాట్లాడుతూ..ఈ చిత్రంలో ఏడు పాటలు స్వరపరిచాం. ఐదు సినిమాలో ఉంటాయి. ఈ పాటలు వివిధ తరహాలో రూపొందించాం. ఒక సంప్రదాయ గీతం చేశాం. చాలా బాగా వచ్చింది. ఆ పాటను చారి గారు కేవలం ఏడు నిమిషాల్లో రాసిచ్చారు. అది ఆయన ప్రతిభకు నిదర్శనం. అన్నారు.

ఈ కార్యక్రమంలో మోహన్ గౌడ్, సాయి వెంకట్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.