గిల్డ్ ప్ర‌తిపాద‌న మేర సెప్టెంబర్ 13న విడుద‌ల‌వుతున్న `నానిస్ గ్యాంగ్‌లీడ‌ర్‌`.. సెప్టెంబ‌ర్ 20న విడుద‌ల‌కానున్న వాల్మీకి

Published on Aug 28,2019 10:45 AM

నాని హీరోగా న‌టించిన `నానిస్ గ్యాంగ్ లీడ‌ర్‌`, వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టించిన `వాల్మీకి` చిత్రాలు సెప్టెంబ‌ర్ 13నే రిలీజ్‌కు సిద్ధ‌మ‌య్యాయి. అయితే ఇలా ఒకేరోజు విడుద‌లైతే నిర్మాతల‌కు న‌ష్టం జ‌రిగే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి కాబ‌ట్టి ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ రెండు చిత్రాల నిర్మాత‌ల‌ను పిలిచి మాట్లాడారు. చ‌ర్చ‌ల అనంత‌రం సెప్టెంబ‌ర్ 13న `నానిస్ గ్యాంగ్‌లీడ‌ర్‌`ను విడుద‌ల చేయ‌డానికి.. సెప్టెంబ‌ర్ 20న  `వాల్మీకి` సినిమా విడుద‌ల చేయ‌డానికి  రెండు సినిమాల నిర్మాత‌లు నిర్ణ‌యించుకున్నారు. ఈ స‌మావేశం అనంత‌రం జ‌రిగిన ప్రెస్‌మీట్‌లో...
కె.ఎల్‌.దామోద‌ర్ ప్ర‌సాద్ మాట్లాడుతూ - ``రెండు సినిమాల రిలీజ్ డేట్స్ ఒకేరోజున కుదిరింది. ఆ సినిమాల నిర్మాత‌లిద్దరూ మా గిల్డ్ గ్రూపులో స‌భ్యులే. కాబ‌ట్టి ఓ సినిమాను వెన‌క్కి వెళ్ల‌మ‌ని గిల్డ్ త‌ర‌పున మేం మేం వారిని ఒప్పించాం. ఇలా స‌ర్దుకు పోవ‌డం అంద‌రికీ మంచి ప‌రిణామంగా భావిస్తున్నాం`` అన్నారు. 
దిల్‌రాజు మాట్లాడుతూ - ``సెప్టెంబ‌ర్ 13కు ముందుగానే `నానిస్ గ్యాంగ్ లీడ‌ర్‌`, వ‌రుణ్ తేజ్ వాల్మీకి చిత్రాల‌ను రిలీజ్ చేయాల‌ని అనుకున్నాం. `సాహో` ఆగ‌స్ట్ 15న రావాల్సింది.. అయితే అది వాయిదా ప‌డి ఆగ‌స్ట్ 30న విడుద‌ల‌వుతుది. దీంతో ఇద్ద‌రు నిర్మాత‌లు `సైరాన‌ర‌సింహారెడ్డి` విడుద‌ల‌ను దృష్టిలో పెట్టుకుని సెప్టెంబ‌ర్ 13న అయితే బావుంటుంది `నానిస్ గ్యాంగ్ లీడ‌ర్‌`, వాల్మీకి నిర్మాత‌లు అనుకున్నారు. గిల్డ్ స‌భ్యుల‌మంద‌రం కూర్చుని ఈ విష‌యంపై చ‌ర్చించుకున్నాం. దీంతో నానిస్ గ్యాంగ్‌లీడ‌ర్ సెప్టెంబ‌ర్ 13న‌, `వాల్మీకి` సెప్టెంబ‌ర్ 20న రావాల‌ని నిర్ణ‌యించుకున్నాం. 14రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్ వారికి మా అంద‌రికీ త‌ర‌పున ధ‌న్య‌వాదాలు. ఎందుకంటే ఇలాంటి ప‌రిస్థితులు ఎదురైన‌ప్పుడు ఎవ‌రో ఒక‌రు వెన‌కా ముందు అడుగు వేస్తే .. అన్ని సినిమాల‌కు బావుంటుంది. భ‌విష్య‌త్‌లోనూ మా నిర్మాతలు రిలీజ్‌ల విష‌యంలో చ‌ర్చించుకుని ముందుకెళ‌తామ‌ని భావిస్తున్నాను. సాధార‌ణంగా పండ‌రోజులంటే రెండు, మూడు సినిమాల‌కు అవ‌కాశం ఉంటుంది. ఏదైనా హాలీడేస్ లేని రోజుల్లో.. వారం ఒక‌రు వ‌స్తేనే బావుంటుంద‌ని నిర్ణ‌యించుకున్నారు. 14 రీల్స్ ప్ల‌స్ నిర్మాత‌ల‌కు, హీరో వ‌రుణ్‌తేజ్‌, డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్‌ల‌కు ధ‌న్య‌వాదాలు. అంద‌రూ స‌హ‌క‌రించారు. చాలా సినిమాలు నిర్మిత‌మ‌వుతున్నాయి. ఇలాంటి స‌మ‌స్య‌లు మ‌ళ్లీ ఎదురు కావ‌చ్చు. అలాంటి సంద‌ర్భాల్లో మేం అంద‌రం కూర్చుని ప‌రిష్క‌రించుకుంటాం.  తెలుగులో హీరోలు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లంద‌రూ బంగారాలు. ప‌రిస్థితి అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకుంటే ఇబ్బందులు ఉండ‌వు. పండ‌గ‌రోజుల్లో సినిమాల‌ను విడుద‌ల చేయాల‌ని అంద‌రూ అనుకుంటారు. అందులో త‌ప్పు లేదు. అయితే హాలీడే లేని రోజుల్లో వారానికి ఒక‌రు ప్రేక్ష‌కుల ముందుకు రావాల‌ని నిర్ణ‌యించుకోవడం మంచిదే. ప్యాన్ ఇండియా సినిమాలు సాహో, సైరా న‌ర‌సింహారెడ్డి విడుద‌ల‌వుతున్న‌ప్పుడు ఇలాగే ఆలోచించి విడుద‌ల ప్లాన్ చేసుకోవాలి. అలాగే నిర్ణ‌యం తీసుకున్నాం. రెండు సినిమాలు ఒకేసారి క్లాష్ వ‌స్తే.. నిర్మాత‌లే న‌ష్ట‌పోతున్నారు. అలాంటి న‌ష్టం లేకుండా మాట్లాడి నిర్ణ‌యం తీసుకుంటున్నాం. ఇక్క‌డ ఎవ‌రినీ బ‌ల‌వంతం చేసేదంటూ ఉండ‌దు. 
మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాత న‌వీన్ ఎర్నేని మాట్లాడుతూ - ``సినిమాను సెప్టెంబ‌ర్ 20న విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నందుకు `వాల్మీకి` చిత్ర నిర్మాత‌లైన రామ్ ఆచంట‌, గోపీచంద్ ఆచంట‌ల‌కు థ్యాంక్స్‌. గిల్డ్‌కు థ్యాంక్స్‌`` అన్నారు. 
14 రీల్స్ ప్ల‌స్ సంస్థ నిర్మాత‌ రామ్ ఆచంట మాట్లాడుతూ - ``ఇలాంటి ప‌రిస్థితులు వ‌చ్చిన‌ప్పుడు సామ‌ర‌స్యంగానే ముందుకు వెళ్లాలి. మా హీరో వ‌రుణ్ తేజ్‌, డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ కో ఆప‌రేష‌న్‌కి, గిల్డ్‌కి థ్యాంక్స్‌`` అన్నారు.