ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కంప్లీట్ అయ్యేది ఎప్పుడో తెలుసా ?

Published on Dec 10,2019 02:13 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ , రాంచరణ్ తేజ్ లు హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రం ''ఆర్ ఆర్ ఆర్''. 300 కోట్ల భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ మన్యం వీరుడు కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఒలివియా మోరిస్ , చరణ్ సరసన బాలీవుడ్ భామ అలియా భట్ నటిస్తున్నారు.ఇప్పటికి  90 శాతం వరకు షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది ఆర్ ఆర్ ఆర్ చిత్రం. అలియా భట్ - చరణ్ లపై షూటింగ్ పూర్తికాగా ప్రస్తుతం ఎన్టీఆర్ - ఒలివియా మోరిస్ లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకులు జక్కన్న.


ఇక ఈ సినిమాని జనవరి లో షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేయాలనే పట్టుదలతో ఉన్నాడట జక్కన్న. జనవరిలో షూటింగ్ కంప్లీట్ అయితే ఫిబ్రవరి నుండి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేయనున్నారు. దాదాపు నాలుగు నెలల పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాగనున్నాయట. ఇది కూడా పాన్ ఇండియా సినిమా కావడంతో అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు జక్కన్న. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 10 భాషలలో ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఆర్ ఆర్ ఆర్ పై అంచనాలు స్కై లెవల్లో ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రాన్ని జులై 30 న విడుదల చేయనున్నారు.