హిట్టు కొట్టిన దీపికా

Published on Jan 11,2020 11:29 AM
దీపికా పదుకోన్ ఛపాక్ చిత్రంతో హిట్ కొట్టింది. యాసిడ్ బాధితురాలి పాత్రలో జీవించి ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటోంది దీపికా. మేఘనా గుల్జార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దీపికా పదుకోన్ మేఘనా గుల్జార్ తో కలిసి నిర్మించడం విశేషం. 2005 లో దేశ రాజధాని ఢిల్లీలోని నడిరోడ్డు లో జరిగిన యాసిడ్ దాడి సంఘటనే ఈ చిత్రానికి మూలం. ఎన్నో కలలు కంటూ భవిష్యత్ కోసం ఆశగా ఎదురు చూసే యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడిన ఓ పోకిరి తన ప్రేమని నిరాకరించడంతో యాసిడ్ దాడి చేస్తాడు.

యాసిడ్ దాడి వల్ల అందమైన ముఖం అందవిహీనమౌతుంది దాంతో ఆత్మస్థైర్యం కోల్పోకుండా తనని తాను మలుచుకున్న వనిత పాత్రలో దీపికా పదుకోన్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే ! క్రిటిక్స్ సైతం దీపికా నటనకు జేజేలు పలుకుతున్నారు. ఇక సామాన్య జనం సైతం ఛపాక్ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. జనవరి 10 న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల ప్రశంసలతో పాటుగా విమర్శకుల ప్రశంసలు లభిస్తుండటంతో చాలా సంతోషంగా ఉంది దీపికా పదుకొన్.