నటుడు ప్రకాష్ రాజ్ పై చెక్ బౌన్స్ కేసు నమోదు

Published on Mar 02,2020 12:06 PM
ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ పై చెక్ బౌన్స్ కేసు నమోదు అయ్యింది. 5 కోట్ల అప్పు ఓ ఫైనాన్షియర్ దగ్గర తీసుకున్న ప్రకాష్ రాజ్ ఆమేరకు పోస్ట్ డేటెడ్  చెక్కులు ఇచ్చాడట. అయితే సదరు ఫైనాన్షియర్ ఆ చెక్కులను అకౌంట్ లో వేసుకోగా బౌన్స్ కావడంతో ప్రకాష్ రాజ్ పై చెక్ బౌన్స్ కేసు పెట్టాడు. కోర్టుని కూడా ఆశ్రయించడంతో ప్రకాష్ రాజ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏప్రిల్ 2 లోపు కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. 

దక్షిణ భారతదేశంలో అన్ని భాషలలో నటించిన ప్రకాష్ రాజ్ తనదైన ముద్ర వేశాడు నటనలో. అయితే వ్యక్తిగత జీవితంలో మాత్రం పలు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. నటుడిగా , నిర్మాతగా , దర్శకుడిగా తన ప్రత్యేకత నిరూపించుకున్నాడు ప్రకాష్ రాజ్. అయితే నటుడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన ప్రకాష్ రాజ్ నిర్మాతగా , దర్శకుడిగా మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేక పోయాడు. ఇప్పటికే పలు వివాదాలతో సహవాసం చేస్తున్న ప్రకాష్ రాజ్ కు ఇప్పుడు 5 కోట్ల చెక్ బౌన్స్ కేసు మరింత అప్రతిష్ఠపాలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.